నా బంగారు త(చె)ల్లి
ఆగస్టు ఏడు (07/08).
ఇంటిలో, డాడీ సినిమాలో పాప లాగ ముద్దు ముద్దుగా మాట్లాడేది.అమ్మ ఎంత కోపంగా పిలిచినా....
ఎంతో ముద్దుగా "ఏంటీ మమ్మీ" ....అనేది. ఆ మాట విని అమ్మ కోపం ఎక్కడికోపోయేది. అన్నయ్య,నేను అమ్మ అని పిలిచినా,తను మాత్రం మమ్మీ అనేది ఎందుకో మరి. నాకు ఒక అన్నయ్య,చెల్లి వున్నారు అని చెప్పుకోటానికే . వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన పెళ్ళి వేడుక నాకు చూసే భాగ్యం లేకపోయింది.కానీ, మా చెల్లి,మా ఇద్దరి వివాహాలు దగ్గర వుండి ఎంతో సంబరంగా చూసింది. పెళ్లయ్యాక,నేను కాస్త పెద్దమ్మాయిలాగ అన్నీ తెలుసుకుని మసులుకోవాలి అనుకుని, బాధ్యతగా వుండేదాన్ని.దానికి,ఒకసారి దేవి,అమ్మ దగ్గర ఏడ్చేసింది,అక్క పెళ్లయ్యాక నాతో ఒక్క ముద్ద కూడా తినిపించుకొలేదని.పిచ్చి ప్రేమ. నాకు నాన్నమ్మ పేరు పెట్టారు.చెల్లికి అమ్మమ్మ పేరు పెట్టారు. మా అమ్మమ్మ నన్ను బాగా గారం చేసేది.నాన్నమ్మ లాగ అనుకుని. మా దేవి సరదాగా దెబ్బలాడేది.నన్ను లెక్క చెయ్యవు ,నేను అంటే నీకు అలుసు అని.బాగా ఆట పట్టించేది, అమ్మమ్మను. తను దూరమైన రోజు
నుంచి అమ్మమ్మ కూడా భౌతికంగా మాతో వుంది అంతే.చివరి మనవరాలు,చిన్నదాన్ని ఎలా తీసుకుపోతావు అని కలవరిస్తూనే, రెండు సంవత్సరాలకే అమ్మమ్మ కూడా చెల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. నా స్నేహితులతో,అన్నయ్య స్నేహితులతో ఎంతో బాగా కలిసిపోయింది.వాళ్ళకి తను అంటే చాలా ప్రాణం.నేను ఒక్కదాన్నే వుండటం,ఒంటరిగా వెళ్ళటం భయం.నాకు తోడు నా చెల్లే. తను దూరమై పుష్కరం పూర్తయ్యింది. ఇంకా నా చుట్టూనే వుంది అనే భావన. తను కనపపడలేదని
మొదట్లో చాలా బాధ పడేదాన్ని, కానీ ఒక రోజు నా మనసుకు ఒక స్పందన కలిగింది.నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీలోనే వున్నాను,నీతోనే వుంటాను.నువ్వు నవ్వుతూ వుండు, నీ నవ్వులో వుంటాను.నువ్వు ధైర్యంగా వుండు , నీ ధైర్యంలో వుంటాను.నన్ను నీలో చూసుకుంటూ వుంటాను.బాధ పడకు అక్క అని నా మనసు మాటలు చెప్పింది. ఇప్పటి నా అల్లరి ,చొరవగా మాట్లాడటం, సరదాగా వుండటం ఇవి అన్నీ నావి కావు.అవి నా దేవివి.నాలో అవి పెట్టి నన్ను సంతోషంలో వుంచుతూ, తనూ మనశ్శాంతిగా వుంటుంది.తనకు మేము అంటే ఎంత ఇష్టం అంటే, తన పేరు చెప్పి,బయట వాళ్ళకి భోజనాలు సరకులు ఇవ్వాలి అని , రెండు సార్లు కోన్నా సరే,ఇవ్వటం కుదరలేదు.
తరవాత సంవత్సరం మాపెద్దమ్మ మనవలకు,మా పిల్లలకు బట్టలు , chocalates కొంటె మాత్రం
ఏ అడ్డంకీ ఇప్పటి వరకు రాలేదు.తనకి మేము అంటే అంత ఇష్టం అని అనుకుంటున్నాము.తను ఎక్కడ వున్నా,మా మనసుల్లో ఎప్పటికీ సజీవంగా వుంటుందని మాకు తెలుసు. మా చుట్టూనే వుంటూ,తను సంతోషంగా వుంటుంది.తను లేని ప్రపంచాన్ని చూపించటానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అయిన,నా చెల్లి ఎప్పుడూ నాతోనే వుంటుంది. నా ఆనందాలను చూస్తూనే వుంటుంది. ఈ రోజు తన పుట్టినరోజు , నా మనసు సంతోషం కోసం తన గురించి కొన్ని మాటలైనా పంచుకోవాలని ఇలా రాస్తున్నాను.
"బంధాలను పదిలంగా ఉంచుకోండి.
విలువగా చూసుకోండి.
బంధం విలువ దేనికి రాదు.
కోల్పోయిన బంధం తిరిగి రాదు."
✍️మళ్ళీ కలుస్తాను.
Comments