సూర్య చంద్రులు

                 సూర్యచంద్రులు 

ఒక ఇంటి కోడళ్ళు సూర్యకాంతం, చంద్రకాంతం.
వరసకు తోడికోడళ్ళు కానీ, తోబొట్టువుల్లగా మెలిగేవారు.వీరు, మానాన్నగారికి మేనత్తలు.
మాఇంట్లో పెద్ద వేడుక జరిగినప్పుడు మాత్రమే ఊరు నుంచి వచ్చేవారు. వచ్చినప్పుడు మాత్రం నాలుగు రోజులు వుండి వెళ్ళేవారు. వున్నన్ని రోజులు భలే సరదాగా వుండేవారు. నాకు ఊహ తెలిసేసరికి వాళ్ళకి యాభైఏళ్ళు పైనే వయసు వుంది. ఇంతకీ సూర్యచంద్రులు ఎక్కడ ఉండేవారో చెప్పలేదు కదా! వాళ్ళు మిలటరీ మాధవరంలో వుండేవారు.ఇద్దరూ భర్తలను కోల్పోయారు.అయినా, వాళ్ళ ధైర్యాన్ని,ఉత్సాహాన్ని కోల్పోలేదు. మాధవరం, మిలటరీకి వెళ్ళేవారికి ప్రాముఖ్యత పొందిన ఊరు మాత్రమే కాదు. దారాలతో అల్లికలకు కూడా చాలా ప్రసిద్ది.అక్కడ అల్లిన వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతాయి. దారంతో చిన్న చిన్న టేబుల్ క్లాత్స్ అల్లేవారు.అవి ఎంత పెద్దవైనా ఆల్లేవారు. ఆ ఊరిలో,చుట్టుపక్కల ఊళ్ళలకు  కొందరు గుత్తేదారులు ఇంటికి వచ్చి దారాలు ఇచ్చి, ఎలాంటి వస్తువులు అల్లాలని చూపించేవారు.
ఇంటిలో ఖాళీ సమయాల్లో మహిళలు,యువతులు,కాలక్షేపానికి వృద్ధులు అందరూ అల్లేవారు.వయసు మీద పడ్డా,కళ్ళు సరిగ్గా కనబడకపోయినా, క్రమబద్దంగా అల్లుకు పోయేవారు.ఒకసారి మాఇంటి గృహప్రవేశానికి సూర్యచంద్రులు ఇద్దరూ వచ్చారు.మాటల్లో తెలిసింది, దారాలతో అల్లుతున్నారని, అమ్మ, వాళ్ళదగ్గర నేర్చుకున్నది.అమ్మ సోఫా సెట్టుకు కావలసినన్ని అల్లింది.గృహప్రవేశం అయ్యాక ,తిరిగి ఊరు వెళ్తూ, ఈసారి డైన్నింగ్ టేబులకి సరిపోయేంతది అల్లి తెస్తాము అన్నారు.ఒక ఆర్నెల్ల తరవాత వేరే ఊరుకి అమ్మవాళ్ళు వెళ్ళినప్పుడు, అక్కడికి తీసుకువచ్చి ఇచ్చారు. అప్పటికి ఇద్దరి వయసు ఇంచు మించు అరవై వుంటాయి. ఆ వయసులో వాళ్ళు అల్లి ఇచ్చిన వస్తువు విలువ  కట్టలేం.అది చూసినప్పుడు, వాళ్ళకి నాన్నగారు అంటే ఎంత ప్రేమ వుందో తెలిసింది.వాళ్ళకి డబ్బులు లోటు లేదు.శ్రమపడే అవసరం లేదు.కానీ,మేనల్లుడు కోసం ఎంతో ఇష్టంతో అల్లి తెచ్చారు.అది ఇచ్చి ఇప్పటికీ పాతికేళ్లు కావస్తుంది.
వాళ్ళు మాకు దూరమై ఎన్నో సంవత్సరాలు అయ్యింది. వాళ్ళు ప్రేమగా అల్లింది చూడటానికి మేనల్లుడు లేడు.కానీ,వాళ్ళు ఇద్దరూ కలిసి అల్లిన వస్తువు , ముగ్గురు ప్రేమకు జ్ఞాపకం భద్రంగా నా దగ్గర వుంది. పెళ్లయ్యాక పుట్టింటికి నుంచి నేను కోరి తెచ్చుకున్న వాటిల్లో ఇది ఒకటి. వాళ్ళు పంచిన ప్రేమ, వాళ్ళ మాటలు ఎప్పుడూ గుర్తొస్తునే వుంటాయి. వాళ్ళు అల్లిన టేబుల్ క్లాత్ చూస్తే మరింత గుర్తుకువస్తారు.వాళ్ళు పంచిన ప్రేమపదిలంగా దాచుకోవాలని,
 ఒక జ్ఞాపకాన్ని అక్షర రూపంలో పొందుపరుచు కోవాలని, ఈ బ్లాగు రాయడానికి నన్ను నా కలం ప్రేరేపించింది.

ఈ సూర్యచంద్రులు బ్లాగు మా సూర్యచంద్రులు ల్లాగ
వారి జీవితాలను సార్థకత చేసుకున్న వాళ్ళకి అంకితం ఇస్తున్నాను.

ఎంత వయసు వచ్చినా, డబ్బు అవసరం లేకపోయినా, శారీరకంగా బలహీనంగా వున్నా,
ఇష్టమైన పని చేస్తూ, కొందరికి ఆ పని ద్వారా ఆనందాన్ని ఇస్తూ ఎందరో సూర్యచంద్రులు ,కొందరి జీవితాల్లో సూర్యని లాగా వెలుగును,చంద్రునిలాగా చల్లగాను చూస్తున్నారు. పుట్టిన ప్రతి జీవి ,చివరి వరకూ ఏదో ఒక పని చేస్తూ వుండాలి.
అప్పుడే ఆ పుట్టుకకు అర్థం.
🙏


మళ్ళీ కలుద్దాం✍️

Comments

Popular posts from this blog

అ'తను'

నా బంగారు త(చె)ల్లి

ఆత్మీయుడు