చల్లని వేసవి
చల్లని వేసవి
ఏప్రిల్26,2022.
వెళ్తేగానీ, ఇంటా,బయట వాతావరణాన్ని తట్టుకోలేమనిపించింది.చల్లని ప్రదేశాలకు వెళ్దామనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి,ఏం చూడాలని అన్నయ్య రూట్ మ్యాప్ వేశాడు.
రెండు రోజుల తరవాత, ఉదయం కడుపును ఇడ్లీ, దోశలతో నింపేసి, కారు డిక్కిని బ్యాగ్స్ తో నింపేసి, పదకొండు గంటలకు కారు బెంగళూరు వెళ్ళే రోడ్డు ఎక్కింది. అలా కార్లో పాటలు,మాటలు,సరదాగా ఆటలు(జ్ఞాపశక్తితో ఆడేవి)రెండు గంటలు పైనే ప్రయాణం సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర కావొస్తోంది. ఆట పాటలకు ఇడ్లీ,దోశలు అరిగిపోయి
ఆత్మారాముడుగోల మొదలుపెట్టాడు. రోడ్డు పక్కన పక్కా హోటల్ దగ్గర కారు ఆగింది.పుష్టిగా అందరం తినేశాక,కారు బయల్దేరింది. తిన్న ఆయాసానికి మిగిలినవారు నిద్రలోకి జారుకున్నారు.నేను ,అన్నయ్య తప్ప.అన్నయ్య డ్రైవింగ్ కాబట్టి,నాకు ప్రయాణంలో నిద్రరాదు కాబట్టి మెలుకువగా వున్నాను. సాయంత్రం ఐదు అవుతుంది, బెంగుళూరు వెళ్ళటానికి ఇంకా రెండు గంటలపైనే పడుతుంది.మధ్యలో ముందు దారిలోనే వున్న
నంది హిల్స్ చూడాలనుకుని, కారు నంది హిల్స్ దారి పట్టింది.వెళ్ళేదారి అంత పెద్దగా చల్లగా అనిపించలేదు కానీ, ఒక్కసారి పైకి వెళ్ళాక ,వేసవి కాలం అనే విషయాన్ని మరిచిపోయాం.అంత ఎత్తున నుంచి కిందకి చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి, సూర్యాస్తమయం వేళ అవ్వటం వల్ల కొండంతా చల్లని వాతావరణంగా మారిపోయింది. ఎవరికి వారు సెల్ఫీలు,సింగిల్ ఫోటోలు,తరవాత గుంపు ఫోటోలు తీసుకున్నాం. ఇలా అక్కడ ప్రకృతి, మా ఆనందం కలిసిన జ్ఞాపకాలతో కొండ కిందకు బయలుదేరాం.బెంగళూరులో మా అక్కవాళ్ళ(కజిన్) వుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం.వేసవికాలం కదా అంతకు ముందు ఊరు నుంచి తెచ్చిన పంచదార కల్తీ పళ్ళు తీసుకువెళ్ళాం (మామిడిలో ఒక రకం) అక్కవాళ్ళతో కలిసి తింటుంటే, ఊర్లో వున్న వాతావరణం వచ్చేసింది. ఎనిమిది గంటల అయ్యింది, అక్కడికి దగ్గరల్లోనే (హైదరాబాదు నుంచి బెంగళూరు దూరం,బెంగళూరు లో ఏ ఏరియా అయినా దగ్గరే అనుకోవాలి మరి).నా స్నేహితుడు వున్నాడు.తనని కలవటానికి నేను ,శ్రీవారు బండి మీద(బావగారిది) వెళ్ళి అక్కడే భోజనం చేసి,కబుర్లు చెప్పుకుని తిరిగి ఇంటికి చేరేసరికి పదకొండు అయ్యింది.వచ్చి నిద్ర పోయాం.పొద్దున్నే లేచి, అందరం కలిసి విశ్వేశ్వరయ్య మ్యూజియం చూసి, అక్కడ మామిడికాయ,ఉప్పు కారం వేసినవి తిని, భోజనానికి తెలుగు వంటల వడ్డించే హోటల్ కి వెళ్ళాం.అక్కడ నుంచి బొటానికల్ గార్డెన్స్ కి వచ్చాం.అక్కడ పచ్చదనం, పూల వనాలు, వాతావరణం చూడటానికి, ఆస్వాదించటానికి చాలా బాగుంది. సాయంత్రానికి ఇంటికి చేరాం.ఒక్క కుటుంబం కలిస్తేనే సందడి,అలాంటిది మూడు కుటుంబాలు,నలుగురు మగపిల్లలు ఇంక ఆ రాత్రి అల్లరికి హద్దు లేదు.మర్నాడు పొద్దున్నే ప్రయాణం బెంగళూరుకు మూడు గంటలు లోపు(సమయం సరిగ్గా గుర్తులేదు) చేరుకునే ప్రదేశం " నిసర్గధామ ." అది కావేరినది తీరానికి ఆనుకుని వున్న ప్రదేశం. అక్కడ నదీ ప్రవాహం తక్కువ గానే వుంది (వేసవి వల్లనేమో)వెడల్పుగా కాకుండా సన్నని పాయ లాగా ప్రవహించడం వల్ల అందరూ మధ్యలో వరకూ వెళ్ళి నదిలో ఆడుకున్నాం. ఎంత సేపు వున్నా తనివి
తీరదు. అక్కడే పక్కన అన్నిరకాల వస్తువులతో కొట్లు వున్నాయి.ధరలు తక్కువ అనే చెప్పాలి.నేను సింగిల్ గాజులు(చెక్కది,మెటల్ ది,పెయింట్ వేసిన సన్న గాజు)కొన్నాను.అమ్మాయిలు వేసుకునే మెత్తని చొక్కా(nylon),ఒకటి గళ్ళ చొక్కా కూడా తీసుకున్నాను.ఏనుగు అంబారీ ఎక్కాం, అప్పుడే జోరున వానలో తడిసిపోతున్నా, సంతోషంగానే అనిపించింది. పిల్లలకు అక్కడ చాలా నచ్చేసింది. అక్కడ నుంచి దగ్గరలో భోజనం చేసి, కార్లు నేరుగా " కూర్గ్ " కు బయల్దేరాయి.మధ్యలో ' అబ్బే ఫాల్స్' చేరుకున్నాం. వాటర్ ఫాల్ అంటే తడవాలి అనే ఆలోచనతో వెళ్ళాం.అబ్బే ఫాల్స్ చూడాలంటే చాలా కిందకి వెళ్ళాలి.చాలా మెట్లు దిగాం. అలా
దిగి ఒక బ్రిడ్జి మీదకు వెళ్ళి ఎడమ పక్కన చూస్తే భయంపుట్టించే నీళ్ళ హోరు.ఎక్కడో వంద మీటర్లు దూరం వుంది,చాలా ఎత్తుగా వుంది. పైనుంచి కిందకు పడే జలపాతం జల్లులు బ్రిడ్జి మీద వున్న వారి మీద పడుతున్నాయి. కాసేపు అక్కడే జల్లుల స్నానం చేసి, బయలుదేరాం.
కూర్గ్ వెళ్ళే మార్గంలోని ప్రయాణమే అసలైన అనుభవం పొందాలి. మేఘాలు వచ్చి వాన జల్లు కురిపించి వెళ్లిపోతాయి.అంతలోనే సూర్యుడి కిరణాలు తాకుతాయి. ఆ ప్రయాణపు అనుభూతులు ఎప్పటికీ మర్చిపోలేం.టీ బ్రేక్ కి ఒక హోటల్ దగ్గర కార్లు అగాయి.అక్కడ ఫోటోలు ,సెల్ఫీలు సరదా కబుర్లతో సాగింది. ఈసారి కారుల్లో
ఎక్కడంలో క్రమశిక్షణ లోపించింది.
నేను,వదిన,బావగారు ఇద్దరు పిల్లలు.ఇంకో కార్లో
అన్నయ్య,అక్క,శ్రీవారు,ఇద్దరు పిల్లలు. కార్లు పోటీ పడుతూ, కొండ ఎక్కుతూ అప్పుడప్పుడు వర్షాన్ని, ఎండను ,చల్లదానాన్ని ఆస్వాదిస్తూ కూర్గ్ లో బుక్ చేసిన హోటల్ కి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది.చలికాలంలాగా ఉంది.వేడి వేడి టీ తాగి, స్నానాలు చేశాక,వేడిగా చపాతీలు తినేసి
ఆదమరచి రగ్గులు కప్పుకుని పడుకున్నాం. తెల్లారింది, కూర్గ్ అందాలు, ఆ వాతావరణంలో వేడి వేడి టీ తాగుతూ, హోటల్ పైనుంచి కనుచూపు మేర పచ్చదనం, మేఘాలు కదలిక ఆహా! అవి ఎప్పుడు తలచుకున్నా ఆ క్షణం చల్లని అనుభూతికి లోనవుతాను.నెమ్మదిగా అక్కడ నుంచి తలకావేరికి చేరుకున్నాం.తల కావేరి అంటే కావేరి నది పుట్టినస్థలం.అక్కడ ప్రతీ క్షణం మేఘాలు మనల్ని
తాకుతునే వుంటాయి. ఫోటో తీసుకునే ఒక్క క్షణంలో పోగలా మంచు కమ్మెస్తుంది,మరుక్షణం వెళ్ళిపోతుంది.అప్పటి కప్పుడు విపరీతమైన చలి పుట్టేస్తుంది.అక్కడ కొంచెం సేపు వుండి,బయల్దేరాం. కానీ, అందరికీ జలపాతంలో తనివి తీరా తడవలేకపోయాం అనే నిరాశ వుంది. అలా అనుకుంటూ, ' బల్మురి ఫాల్స్'
వైపు కార్లు వెళ్తున్నాయి.అక్కడ కూడా పెద్దగా ప్రవాహం లేదనుకుంటూ ముందు నడుస్తుంటే, కొంతమేరకు నాలుగు అడుగులు ఎత్తు నుంచి జలపాతం ఒక దగ్గర పడుతుంది.అంతే ,పట్టలేని ఆనందంతో ఈత వచ్చినవాళ్ళు ఈత కొట్టారు. ఆడుకునేవారు అడుకున్నారు.అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో మైసూర్ పాలస్ గేటు
బయటనుంచే చూసి,అక్కవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు,మేము హైదరాబాదు దారి పట్టాం.
బెంగళూరు దాటకుండానే భోజనం చేసేసి రాత్రికి అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాo.పొద్దున్న లేచాక, అన్నయ్య మ్యాట్నికి సినిమా టికెట్స్ బుక్ చేశాను, మల్టీప్లెక్స్ లో. సినిమా అయ్యాక అక్కడే అలా మాల్ లో తిరిగి వచ్చేద్దాం అన్నాడు.రేపు వెళ్ళేవాళ్ళం కదా అని నేను అన్నాను.మూడు రోజులు చల్లగా తీరిగాం, ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలకు పిల్లలు ఇబ్బంది పడతారు. అలా రెండు రోజులు రెండు సినిమాలు మ్యాట్ని కి వెళ్ళాం.
సాయంత్రం వరకు మాల్స్ లో తిరిగినంత తిరిగి, తిన్నంత తిని రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం.రోహిణి కార్తె కూడా వెళ్లిపోవడంతో కాస్త ఎండలు తగ్గటంతో ఆ వేసవి చల్లగా హాయిగా ఇలా మంచి జ్ఞాపకంగా రాసుకోవడానికి ,ఒక అనుభవంగా గుర్తుండి పోయింది.✍️
Comments